23 March 2011

Telugudanamu తెలుగుదనము తీయదనము

తెనుగుదనము వంటి తీయదనము లేదు

తెనుగు కవులవంటి ఘనులు లేరు

తెనుగుతల్లి సాధుజన కల్పవల్లి రా

లలిత సుగుణజాల! తెలుగు బాల!


కష్టబెట్టబోకు కన్నతల్లి మనస్సు

నష్టబెట్టబోకు నాన్న పనులు

తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా

లలిత సుగుణజాల! తెలుగు బాల!


బడికి నడువలేడు; పాఠాలు వినలేడు;

చిన్న పద్య మప్పజెప్పలేడు

రాజరాజు బిడ్డరా నేటి విద్యార్థి!

లలిత సుగుణజాల! తెలుగుబాల!


బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటెగాదు

చచ్చికూడ చీల్చి యిచ్చు తనువు

త్యాగభావమునకు తరుపులే గురువులు!

లలిత సుగుణజాల! తెలుగుబాల!


దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు;

భాత్ర్పజనము వచ్చి పంచుకోరు

విశ్వవర్ధనంబు విద్యా ధనంబురా

లలిత సుగుణజాల! తెలుగుబాల!

No comments: